Make moneyPolitical newsSports newsTips & TricksTop newsTravelTrending newsViral news

Telangana Rain updates live Today

రేపు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులపై కీలక ఆదేశాలు

 

  • రేపు తెలంగాణలోని 11 జిల్లాలకు భారీ వర్ష సూచన
  • ముందస్తు చర్యలపై ఆ 11 జిల్లాల కలెక్టర్లు..ఎస్పీలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
Telangana Rains: రేపు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులపై కీలక ఆదేశాలు

Telangana Rains: రేపు కూడా తెలంగాణలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రానున్న 24 గంటలలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికలున్న 11 జిల్లాలైన ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలను సమీక్షించారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురిసే అవకాశమున్న ఈ జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

నిర్మల్ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

 

ఇప్పటికే గత నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున, రానున్న భారీ వర్షాల వలన పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశముందని పోలీసు తదితర శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలన్నారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్మల్‌కు 31 సభ్యులు, నాలుగు బోట్లు ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపుతున్నామని తెలిపారు.

 

ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నుండి ప్రస్తుతం 20000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, ఈ నీటి పరిమాణం ఎక్కువైతే నేడే పరీవాహక ప్రాంతాల్లో తగు ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని తెలియజేశారు.

 

మహారాష్ట్ర పరీవాహక ప్రాంతం నుండి వచ్చే నీటి పరిమాణాన్ని ఎప్పటి కప్పుడు తెలుసుకొని తగు జాగ్రత్తలు చేపట్టేందుకు మహారాష్ట్ర అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. కల్వర్టులు, వాగుల వద్ద సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ల అధికారులతో జాయింట్ టీమ్‌లను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని అన్నారు. ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్న తమను సంప్రదించాలని కలెక్టర్లను కోరారు. జిల్లా కలెక్టరేట్‌లలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లు 24 / 7 పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. రేపటి వరకు భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో ఎస్పీలు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని పనిచేయాలని ఆదేశించామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి క్రేన్‌లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపామన్నారు.

 

 

 

 

 

 

 

 

 

Tags

Related Articles

Back to top button
Close
Close