Off The Record : కేసీఆర్ ట్రెండ్ మార్చబోతున్నారా..? దూకుడు పెంచబోతున్నారా..?

[ad_1]

కేసీఆర్ ట్రెండ్ మార్చబోతున్నారా? ఇక దూకుడు పెంచబోతున్నారా? అందుకోసం కీలక నిర్ణయం తీసుకున్నారా? దాని ప్రభావంతో కేడర్‌లో ఊపు వస్తుందా? ఎన్నికల ఫలితాలు, వలసలతో డీలాపడ్డ గులాబీ దళంలో ఉత్తేజం నింపడానికి కేసీఆర్ అందించబోతున్న ఆ చవన్‌ప్రాస్ ఏంటి? దాని ప్రభావం నిజంగానే ఆ రేంజ్‌లో ఉంటుందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది బీఆర్‌ఎస్. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం పదహారు శాతం ఓటు బ్యాంక్‌కు పరిమితం కావడం, పార్టీ చరిత్రలో తొలిసారి లోక్‌సభలో జీరో అయిపోవడం, అసలు సగం ఎంపీ సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం లాంటి పరిణామాలు ఆ పార్టీ అధిష్టానం అస్సలు ఊహించనివి. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే టాప్ టు బాటమ్ పార్టీని బాగా కుంగదీసిందన్నది విస్తృతాభిప్రాయం. ఇలాంటి సమయంలో కవిత బెయిల్‌పై బయటకు రావడం పార్టీకి, ప్రత్యేకించి అధినాయకత్వానికి కొండంత రిలీఫ్‌గా ఉందట. ఇప్పటి వరకు వేదనతో ఉన్న కేసీఆర్ ప్రస్తుతం కొంత టెన్షన్ ఫ్రీ అయ్యారన్నది పార్టీ వర్గాల సమాచారం. ఇకనుంచి ఆయన పార్టీ బలోపేతం, కార్యక్రమాల నిర్వహణపై దృష్టి పెట్టవచ్చని అంటున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్ళడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్, హరీష్ రావు పాల్గొంటూ వస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన దగ్గర్నుంచి నిన్న మొన్నటి రైతు ధర్నాల వరకు అంతా ఈ ఇద్దరు నేతల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే నడిచాయి.
అయితే… ఓటమి తర్వాత ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల సమయంలో తప్ప మిగతా టైంలో బయటకు రాని కేసీఆర్ ఇక పద్ధతి మార్చబోతున్నారన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్ టాక్. అందుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కేసీఆర్ అక్కడ జారి పడిపోవడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ సమస్యతోనే కొన్ని నెలల పాటు ఇబ్బంది పడ్డారాయన. లోక్‌సభ ఎన్నికల టైంలో బస్సు యాత్రతో ప్రచార సభల్లో పాల్గొన్నారాయన. కానీ.. ఆ తర్వాత ఎప్పుడూ బయటికి వచ్చి జనంలోకి వెళ్లింది లేదు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం మీదా పెద్దగా స్పందించింది లేదు. కానీ… కాంగ్రెస్ మాత్రం గత ప్రభుత్వ నిర్ణయాల ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూనే ఉంది. కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదన్న విమర్శలు పెరిగిపోయిన క్రమంలో బడ్జెట్ సెషన్‌లో ఒక్కరోజు వచ్చి మమ అనిపించారు కేసీఆర్. ఈ పరిస్థితుల్లో… అప్పుడప్పుడైనా ఆయన జనంలోకి వచ్చి కనిపిస్తుంటే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీలోనే పెరుగుతోందట. కేసీఆర్ కూడా అందుకు సుముఖంగానే ఉన్నా… సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారన్నది నాయకులు చెప్పుకునే మాట. ఇదే సమయంలో గ్రామాల్లో చర్చ జరుగుతున్న రుణమాఫీ, రైతు భరోసాను అస్త్రంగా మలుచుకుని కేసీఆర్ నేరుగా ప్రజల్లోకి వచ్చే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ఎన్నికల సమయంలోనే ప్రచారం పేరుతో ఆయన జనాల్లోకి వస్తే వేరేలా అర్ధం చేసుకుంటారని, అందుకే ఇక మీదట ఇలాంటి అంశాలు దొరికినప్పుడల్లా బయటికి వచ్చి హడావిడి చేస్తే… బహుళ ప్రయోజనాలు నెరవేరతాయన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందంటున్నారు. ప్రత్యేకించి రైతుల సమస్యల పేరుతో ఫీల్డ్ లోకి వస్తే పార్టీకి కూడా మంచి మైలేజ్ వస్తుందన్నది పెద్దల అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు. దీంతో ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా… సెప్టెంబర్ మొదటి వారంలోనే ఆయన టూర్ మొదలు కావచ్చంటున్నారు. కొత్త ఊపుతో… సరికొత్తగా జనం మధ్యకు రాబోతున్న కేసీఆర్ అమ్ముల పొదిలో ఏయే అస్త్రాలు ఉంటాయో చూడాలంటున్నారు పరిశీలకులు.
[ad_2]