5G ఇంటర్నెట్ వచ్చేసింది మన జీవితాలలో రాబోయే మార్పులు ఇవే
With the advent of 5G internet these are the changes that are coming in our lives

ఇంట్లో నీళ్లు లేకపోయినా ఉంటామేమో కానీ.. ఇంటర్నెట్ లేకుండా ఒక్క క్షణం ఉండలేని రోజులివి. టెక్నాలజీలో ఇప్పటికే దూసుకుపోతున్న ప్రపంచం.. ఇంకా సూపర్‌ఫాస్ట్‌గా పయనించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు కమ్యూనికేషన్ రంగంలో ఫస్ట్ జెనరేషన్ వరకు ఫోర్త్ జనరేషన్ వరకు వచ్చిన మనం.. ఇక ఫిఫ్త్ జనరేషన్‌లోకి మారబోయే రోజులు దగ్గరికొచ్చాయి. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ దేశంలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. వన్స్ 5జీ ఎంటరైతే.. మానవ జీవితంలో విప్లవాత్మక మార్పులు రావడం పక్కా. అయితే 5జీ అంటే ఏమిటి..? దాంతో ఏం చేయవచ్చు..? అది ఎలా ఉండబోతుందో ఓ స్మార్ట్ లుక్కేద్దాం..!
5జీ రాకతో మన జీవితాలలో రాబోయే మార్పులేంటి?
చిటికెలో రెండు గంటల సినిమా డౌన్ లోడ్ చేయొచ్చు. ఇంట్లోని ఎలక్ట్రానిక్ డివైజ్‌లను చేతిలోని మొబైల్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేలోపే ఏసీ ఆన్ చేసుకోవచ్చు. ఫ్రిజ్‌ను మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. వేల కిలోమీటర్ల దూరంలో పేషెంట్‌కు డాక్టర్లు సర్జరీలు చేయొచ్చు. డ్రైవర్ లేకుండా కార్లు రోడ్లపై పరుగులు పెట్టొచ్చు. ఇలా ఒకటా, రెండా.. 5జీ వల్ల ఎన్నో ఉపయోగాలు. 5జీ వస్తే నెట్ స్పీడ్ మాత్రమే పెరగడం కాదు.. ఒక్కమాటలో చెప్పాలంటే సమాచార స్వరూపమే మారిపోతుంది. 5జీ యుగం కొద్దిరోజుల్లోనే స్టార్ట్ కానుంది. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి 5జీ దూసుకొస్తోంది. ఇది మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది..? ఈ 5జీ కోసం కొత్త ఫోన్లు కొనుక్కోవాలా..? మారుమూల ప్రాంతాలకూ 5జీ సేవలు విస్తరిస్తాయా..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..!
5జీ రాకతో ఇంకా ఏమేమి మార్పులు వస్తాయాంటే!
ప్రపంచం 5జీ నెట్‌వర్క్ వైపు శరవేగంగా పరుగులు పెడుతోంది. ఇప్పటి వరకు భారత్ లో 2జీ, 3జీ, 4 జీ టెక్నాలజీ ఆధారంగా మొబైల్, ఇంటర్నెట్ వినియోగం జరుగుతోంది. అయితే, 5జీ విషయానికి వస్తే మాత్రం స్పీడ్ పరంగా, సేవల నాణ్యత పరంగా చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. 4జీ టెక్నాలజీ ద్వారా ఒక చదరపు కిలో మీటర్లో 10,000 మందికి సేవలు అందిస్తే… అది 5 జీ టెక్నాలజీ ద్వారా ఏకంగా 25,00,000 (25 లక్షల) నుంచి 30,00,000 (30 లక్షల) మందికి నాణ్యమైన సేవలను అందించవచ్చు. భారీ అపార్టుమెంట్లు, సెల్లార్ ప్రాంతాల్లోనూ చాలా స్పష్టమైన సేవలను దీంతో అందించవచ్చు. కేవలం మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ మాత్రమే కాకుండా, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే, రోడ్లు ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలతో పాటు, డిఫెన్స్, ఆర్థిక రంగాల్లోనూ భాగస్వామ్యం కానుంది 5జీ నెట్‌వర్క్.
ప్రస్తుతం వైర్‌లెస్ నెట్‌వర్కుల్లో మనం వాడుతున్న 4జీ పరిజ్ఞానానికి తర్వాతి దశ 5జీ. ఇది ఫిఫ్త్ జెనరేషన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ప్రాథమిక దశలో 5జీ సేవల వల్ల మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, హై డెఫినేషన్ వీడియోలు, వర్చువల్ రియాలిటీ వంటివన్నీ అత్యంత సులభమైపోతాయి. డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్లు అత్యంత వేగంగా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. కళ్లుమూసి తెరిచేలోగా.. మూవీ డౌన్‌లోడ్ అయిపోతుంది. క్లియర్ క్లారిటీతో వీడియోకాల్స్ చేసుకోవచ్చు. ఇంతకాలం 4జీ వాడుతున్న వినియోగదారులను 5జీ మరింత పరుగులు పెట్టిస్తుంది. 5జీ నెట్‌వర్క్ వాస్తవ పరిస్థితుల్లో.. ఇప్పుడున్న వేగం కన్నా.. 10 నుంచి 20 రెట్లు అధిక వేగంగా.. బ్రౌజింగ్, డౌన్‌లోడ్ స్పీడ్ అందించగలదు. అంటే ఒక హై డెఫినేషన్ సినిమా వీడియోను.. ఒక్క నిమిషంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట.
5జీ ఆగమనంతో ఏ ఏ రంగాలు లాభపడనున్నాయి..?
5జీ నెట్‌వర్క్ రాకతో ఆటోమొబైల్, ఫైనాన్స్, హెల్త్ కేర్ వంటి ఎన్నోరంగాలు ప్రగతిసాధ్యమై.. ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది. 5జీ వస్తే ఏకకాలంలో మరిన్ని డివైజ్‌లను మొబైల్ ఇంటర్నెట్‌కి కనెక్టయ్యేలా వీలు కల్పిస్తుంది. వంటగదిలో వాడే మైక్రోఓవెన్, ఫ్రిజ్‌లనుంచి ఇంట్లోని ఏసీ, వాషింగ్ మెషీన్‌లను సైతం 5జీ స్పీడ్‌తో మొబైల్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను కూడా ఉన్నచోట నుంచి ఆపరేట్ చేయొచ్చు. అంతేనా.. 5జీతో డ్రైవర్‌లెస్ కార్లు రోడ్లపై పరుగులు పెడతాయి. డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొడతాయి. 5జీ వేగాన్ని అందుకోవాలంటే.. 5జీ టెక్నాలజీ ఉన్న స్మార్ట్ ఫోన్ తప్పనిసరి.
మార్కెట్ లో 5జీ కోసం పోటీ మొదలైందా..?
మొబైల్ తయారీ కంపెనీలు సైతం 5జీ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి. 5జీ నెట్‌వర్క్ పై పని చేసే ప్రీమియం నెట్‌వర్కులను ప్రపంచ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే.. కొన్ని 5జీ ఫోన్లు కూడా భారత మార్కెట్లోకి రంగప్రవేశం చేశాయి. 5జీ వాడకంలో చైనా అన్ని దేశాలకంటే ముందంజలో ఉంది. అక్కడ ఇప్పటికే 5జీ నెట్‌వర్క్ ప్రారంభమైంది. 5జీ టెక్నాలజీతో డాక్టర్లు అక్కడ ఆపరేషన్లు చేస్తున్నారు.
5జీ మన దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది..?
కొత్త సర్వీసుల విషయంలో మొబైల్ తయారీ సంస్థలతో కలిసి ప్రయోగాలు చేస్తున్న టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్‌ను వేలం వేసి విక్రయించడంలో ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థలు బిజీగా ఉన్నాయి. 5జీ నెట్‌వర్క్ త్వరలోనే భారత్‌లో అడుగుపెట్టబోతోంది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ-2018కి అప్పట్లోనే కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానం ద్వారా 5జీ టెక్నాలజీ సాయంతో హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తృతం చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటు ధరలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఒక సెకన్‌కు 50 మెగాబైట్ల వేగంతో 5జీ సేవలను విస్తృతం చేయడం ద్వారా 2022 నాటికి దేశంలో 40 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగాన్ని లాభాల బాటలోకి తెచ్చేందుకు కూడా కేంద్రం ప్రయత్నిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది భారత్‌లో 5జీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
చివరిగా…
5జీ టెక్నాలజీ వల్ల లైఫ్ ఈజీగా మారొచ్చేమో గానీ, అదే టెక్నాలజీ.. మన నోటి దగ్గర కూడు లాగేసుకునే అవకాశం కూడా ఉంది. ఫ్యాక్టరీల్లో కూడా ఆటోమెషిన్ పెరగడం వల్ల మనుషుల కంటే.. టెక్నాలజీనే నమ్మేందుకు సంస్థలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే.. ప్రొడక్టివిటీని ఎక్కువగా పెంచుకునేందుకు ఇవి దోహదపడతాయి. దీంతో కంపెనీలు మ్యాన్ పవర్‌ను తగ్గించుకుంటాయి. అదే జరిగితే.. లక్షల్లో ఉద్యోగాలు ఊడిపోతాయి. 5జీ టెక్నాలజీ వల్ల.. మనిషి జీవితంలో వేగం పెరుగుతుందేమో కానీ, పెను మార్పులు రావడమనేది ఖాయం.