రజనికాంత్ ‘సీనియర్ స్టూడెంట్’ వ్యాఖ్యలు.. తమిళనాట ఒక్కసారిగా అగ్గిరాజుకున్న రాజకీయం..

[ad_1]

సూపర్ స్టార్ రజనీకాంత్ సరదాగా మాట్లాడిన మాటలు పెను దుమారమే రేపాయి. వయస్సు గురించి రజనీకాంత్ ప్రస్తావించగా అదే వయస్సు అనే మాటతో తలైవా రివర్స్ అటాక్ ఎదుర్కొన్నారు. ఇంతకీ రజనీకాంత్ ఏమన్నారు.. వివాదం ఎందుకైంది.
తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. డిఎంకె ప్రతిష్ట గురించి మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో లేకపోయినా తిరిగి నిలబడేంతలా కరుణానిధి ఆ పార్టీని పటిష్టం చేశారని భవిష్యత్తులో కూడా సుదీర్ఘకాలం పార్టీ కొనసాగుతుందని అన్నారు. కరుణానిధి అనంతరం ప్రస్తుత సీఎం స్టాలిన్ కూడా పార్టీని తన పాలనతో ముందస్తు ఆలోచనలతో ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. అయితే తరగతి గదిలో టీచర్లు మారుతున్నా.. స్టూడెంట్స్ మాత్రం అలాగే ఉంటున్నారని.. సీనియర్ స్టూడెంట్స్ తరగతి గదిలోనే ఉంటే జూనియర్ స్టూడెంట్స్‌కు అవకాశం ఎలా వస్తుందని.. పార్టీలో సీనియర్ నేతలకు చురకలంటించేలా.. రజనీకాంత్ సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారానికి కారణం అయ్యాయి.
పార్టీలో కరుణానిధి సహచరులుగా ఉన్న దొరై మురుగన్ లాంటి చాలామంది సీనియర్లు క్రియాశీలకంగా ఉంటున్నారు. ఇక రజనీ వ్యాఖ్యలకు దొరైమురుగన్ ఘాటుగా స్పందించారు. పళ్ళు ఊడిపోయిన వయసులో ఉన్న నటులు కూడా సినిమాలు చేస్తుంటే.. యువనటులకు అవకాశాలు ఎలా వస్తాయని.. రజనీకాంత్ చెప్పిన సీనియర్లు జూనియర్లు అంశం నిజమైతే.. తాను చెప్పింది కూడా నిజమే కదా.. మరి దీన్ని ఏమంటారని దొరై మురుగన్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కూడా రజనీకాంత్‌కు కౌంటర్ వేస్తూ పలువురు పోస్టులు పెట్టడంతో పొలిటికల్‌గా పెద్ద వివాదమైంది. దొరై మురుగన్ వ్యాఖ్యలపై రజనీకాంత్‌ను మీడియా వివరణ కోరగా.. దొరైమురుగన్, తాను చిరకాల మిత్రులమని.. తామిద్దరి మాటలు సరదాగా మాట్లాడుకున్నవిగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అన్నారాయన. అయితే అంతటితో వివాదం సర్దుమనగలేదు. ఈ ఇద్దరి వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర చర్చకు తెరలేపాయి.
సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిది స్టాలిన్ పార్టీలో కీలకంగా ఉంటున్నారు. రానున్న రోజుల్లో సీనియర్ల కంటే జూనియర్లకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారని.. అదే వ్యాఖ్యలు సభలో రజనీకాంత్ మాట్లాడారని సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. నటుడు విజయ్ పెట్టిన పార్టీకి కౌంటర్‌గా రజనీకాంత్ ఇలా వ్యాఖ్యలు చేశారని మరో వర్గం చెబుతోంది.
[ad_2]
Source link